Bharat Bandh: మొదటిరోజు భారత్ బంద్.. పలుచోట్ల నిరసనలు, అరెస్టులు..

Bharat Bandh: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ తెలుగురాష్ట్రాల్లో ప్రశాంతంగా సాగింది. దీనిలో భాగంగా పలు ప్రాంతాల్లో కార్మికులు, కార్మిక సంఘం నాయకులు రోడ్లమీదకువచ్చి నిరసన తెలిపారు. కేంద్రం కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిలో భాగంగా విజయవాడలో కార్మికులు కదం తొక్కారు. లెనిన్ సెంటర్ వద్ద బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.
భారత్ బంద్‌లో భాగంగా విశాఖలోని మద్దిలపాలెం ఆటో మోటివ్స్ జంక్షన్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలంటూ నేతలు, కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.
విశాఖలోఆర్టీసీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమను ఆప్కాస్‌లో చేర్చాలంటూ నినాదాలు చేశారు. వేతనాల్లో కోత పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ బంద్‌లో భాగంగా తిరుపతిలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోడును పట్టించుకోవాలంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరంలోను కార్మికులు నిరసన చేపట్టారు. పట్టణంలోని అమర్ భవన్ నుంచి కోట జంక్షన్ మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. సమ్మెలో భాగంగా శ్రీకాకుళంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. స్థానిక డైమండ్ పార్కు నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది. కేంద్రం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.
భారత్ బంద్‌లో భాగంగా తూర్పుగోదావరిజిల్లా కాకినాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోస్టు ఆఫీస్ నుంచి కలెక్టరేటర్ వరకు సాగిన ర్యాలీలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక గుంటూరులోను కార్మిక సంఘాలు కదం తొక్కాయి. గుంటూరు మార్కెట్ కూడలినుంచి లాడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో రోడ్ వేస్, ట్రాన్స్ ఫోర్టు, బ్యాంకింగ్, ఇన్సురెన్స్, ఎకలక్ట్రిసిటీ, పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కేంద్రం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో ట్రేడ్ యూనియన్లు కదం తొక్కాయి. కార్మికులతో కలిసి జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి మండలాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు.
కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ హైదరాబాద్‌లో వామపక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్రభుత్వ రంగ సంస్థలుప్రైవేటీకరణతో్పాటు .. పెట్రోల్,డీజీల్ ధరలను పెంపును నిరసిస్తూ నారాయణగూడలో ర్యాలీ తీశాయి. ఇకనైనా కార్మికవ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాట వెంకట రెడ్డి.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జాతీయ రహదారిపై చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిందని విమర్శించారు.
జాతీయకార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా సింగరేణిలో సమ్మెప్రభావం కనిపించింది. బెల్లంపల్లి రీజినల్‌లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్‌లోని బొగ్గుగనులు, ఓపెన్ కాస్ట్ లో పనిచేసే కార్మికులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నారు. సమ్మెకారణంగా పోలీసులు ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com