Jodo Nyay Yatra: నేడు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయాన కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్ధమైంది. 2022 సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరిట రాహుయ్ యాత్ర చేపట్టనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్ నుంచి ఆది వారం ఈ యాత్రను రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ వైఫల్యాలను చాటి చెప్పేందుకుప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని హస్తం పార్టీ భావిస్తోంది.నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం సహా కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్ నుంచి ప్రారంభమై 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా సాగుతుంది. ముందుగా నిర్ణయించినట్లు మణిపుర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలందరూ భారత్ జోడో న్యాయ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6 వేల 713 కిలోమీటర్ల దూరం సాగనుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాలు 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మణిపుర్‌లో ప్రారంభంకానున్న యాత్ర ముంబయిలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. భారత్ జోడో న్యాయ్ యాత్రఉత్తరప్రదేశ్‌లో 11 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్ల మేర సాగనుంది. యూపీలో 11 రోజుల పాటు.. 20 జిల్లాలను చుట్టేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. మణిపూర్‌లో ఒకరోజు సాగిన తర్వాత నాగాలాండ్‌లోకి ప్రవేశించి రెండు రోజుల పాటు 257 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అసోంలో 833 కిలోమీటర్లపాటు సాగిన అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాలల్లో ఒకరోజు రాహుల్ యాత్ర చేపడతారు. అనంతరం పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ఒడిశాఛత్తీస్‌గఢ్ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగనుంది.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రోజుకు రెండుసార్లు పౌర సమాజ సభ్యులు, సంస్థలతో రాహుల్‌గాంధీ మాట్లాడుతారు. 2022 సెప్టెంబరు 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కారణమైంది. అప్పుడు భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 జిల్లాలు, 76 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేసింది. ఇప్పుడు 100 లోక్‌సభ, 337 శాసనసభ నియోజకవర్గాలను రాహుల్ యాత్ర చుట్టేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com