BHARAT ROW: "భారత్‌"పై రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏం చెప్తున్నాయ్‌

BHARAT ROW: భారత్‌పై రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏం చెప్తున్నాయ్‌
X
సుప్రీంకోర్టులో గతంలోనే ఇండియా పేరు మార్పుపై పిటిషన్లు... పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ సాధ్యమేనా...

ప్రపంచవ్యాప్తంగా ఇండియాగా పిలుస్తున్న మన దేశాన్ని ఆంగ్లంలో కూడా భారత్‌గా పిలిచేలా కేంద్రం మార్పులు చేస్తోందనే ప్రచారం..రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ వేదికగా జరగనున్న జీ 20 సదస్సుకు హాజరయ్యే అతిథులకు రాష్ట్రపతి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందు ఆహ్వానం ఈ వివాదాన్ని రాజేసింది. ఆ అహ్వాన పత్రికలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని పేర్కొనడంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు, సామాన్యులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే ఇండియా పేరును భారత్‌గా మార్చవచ్చా ? అసలు రాజ్యాంగంలో ఏముంది ? సుప్రీం కోర్టు గతంలో ఏం చెప్పింది ? పార్లమెంట్‌లో ఆర్టికల్‌ 1 సవరణ సాధ్యమవుతుందా ? అన్న ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కూడా గతంలో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇండియా పేరును భారత్‌గా మార్చాలంటూ 2016లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ పిల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..ఇటువంటి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోబోమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. 2020లోనూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఇండియా అనే పదం వలసవాదులు ఇచ్చిందని అది బానిసత్వానికి చిహ్నంగా ఉందని పిటిషనర్‌ వాదించారు. సుప్రీంకోర్టు దీన్ని కూడా తోసిపుచ్చింది. ఇదే పిటిషన్‌ను అభ్యర్థనగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచించారు. 2015లోనూ ఇండియా పేరు మార్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

రాజ్యాంగ సవరణ తప్పనిసరి

ఇండియాకు బదులు భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే మాత్రం.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్టికల్‌ 1లో సవరణ చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టాలి. అయితే సాధారణ మెజార్టీతో అంటే మొత్తం సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది ఆమోదంతో దీన్ని సవరించడం వీలుకాదు. ఆర్టికల్‌ 1ను సవరించాలంటే ప్రత్యేక మెజార్టీ అంటే మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ‘భారత్‌’గా మార్చేందుకు సంబంధించిన బిల్లును ఈ నెల మూడో వారంలో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇండియాను ‘భారత్‌’గా పిలిచేందుకు రాజ్యాంగపరమైన అభ్యంతరం ఏమీ లేదని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అన్నారు. అటువంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఇండియా అనే పేరును పూర్తిగా లేకుండా చేసేలా ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తించదని ఆశిస్తున్నానని చెప్పారు.

Tags

Next Story