Bhopal: సహజీవన భాగస్వామిని చంపి.. శవం పక్కనే రెండ్రోజులు

Bhopal:   సహజీవన భాగస్వామిని చంపి.. శవం పక్కనే రెండ్రోజులు
X
స్నేహితుడితో మందు పార్టీ చేసుకుంటుండగా వెల్లడి

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న ప్రియురాలిని చంపి బెంగళూరు మున్సిపాలిటీ చెత్త ట్రక్కులో పడేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన మరువక ముందే భోపాల్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

రితికా సేన్‌(29), సచిన్ రాజ్‌పుత్ (32) ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. భోపాల్‌లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 27న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో సచిన్ రాజ్‌పుత్.. రితికా గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, తాడుతో కట్టి ఇంట్లోనే వదిలేశాడు. అనంతరం సచిన్.. ఒక స్నేహితుడితో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్.. నిజాన్ని కక్కేశాడు. రితికాను చంపేసి ఇంట్లో ఉంచినట్లు చెప్పాడు. కానీ స్నేహితుడు నమ్మలేదు. మరుసటి రోజు స్నేహితుడు.. సచిన్ ఇంటిని పరిశీలించగా రితికా మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుళ్లిపోయిన డెడ్‌బాడీనికి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం నిందితుడు సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంట్లోంచి కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story