Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు బిగ్ ట్విస్ట్

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచరాణ జరిపింది.
ఈ విచారణలో భాగంగా ధర్మాసనం కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో పాటు మిగిలిన నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ... విచారణాధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, దర్యాప్తు సంస్థ, విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, సీబీఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా నిలిపివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా.. హైకోర్టు భిన్నంగా స్పందించింది. సీబీఐ రివిజన్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
