Bihar : కులగణనకు గ్రీన్‌సిగ్నల్‌

Bihar : కులగణనకు గ్రీన్‌సిగ్నల్‌
నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ఊరట , ప్రారంభం కానున్న సర్వే

బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

ఈ జనవరిలో బిహార్ ప్రభుత్వం కులగణనను మొదలుపెట్టింది. మొదటి దశ సర్వే జనవరి 7 -21 తేదీల మధ్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే15తో ముగియాల్సి ఉండగా.. మే 4న పట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి కొట్టేసింది. అయితే, పట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది దిను కుమార్ తెలిపారు.


కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21న రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది కేంద్రం పరిధిలోకి వస్తుందని, రాష్ట్రం ఈ పని ఎలా చేస్తుందని సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు మే 4న తాత్కాలిక స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని దేశ అత్యున్నత ధర్మాసనంలో ప్రభుత్వం సవాలు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి పాట్నా హైకోర్టుకే తిరిగి పంపింది. దీనిపై హైకోర్టులో ఐదు రోజుల పాటు విచారణ కొనసాగింది. అనంతరం జులై 7న కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. పాట్నా హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరిస్తూ కుల గణనపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు తీర్పు చెప్పింది. గతంలో ఇదే కోర్టు కులగణను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఈ సర్వేలో 1951 నుండి ఎస్సీ, ఎస్టీల కులాల డేటా సేకరిస్తున్నారు. పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు ఎనిమిది స్థాయిల్లో సర్వే చేస్తారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా డేటా సేకరిస్తారు. యాప్‌లో స్థలం, కులం, కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య, వారి వృత్తి, వార్షిక ఆదాయం గురించి ప్రశ్నలు ఉంటాయి. ఈలెక్కల సేకరణ కోసం ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఉపాధి హామీ కార్యకర్తల్ని ఉపయోగించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story