Madhya Pradesh : మధ్యప్రదేశ్ సీఎం శాఖలో భారీ అవినీతి..

Madhya Pradesh : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఏకంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న శాఖలోనే అవినీతి బట్టబయలైంది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్‌మాల్ జరిగింది. 2018-21 వరకు మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది. టేక్ హోం రేషన్ పథకంలో జరిగిన భారీ స్కామ్‌కు సంబంధించి 36 పేజీల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది.
రేషన్ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలాయి. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్ గుర్తించారు.
2018లో కేవలం 9 వేలు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2021 నాటికి ఏకంగా 36.08 లక్షలకు పెరిగింది. ఉచిత రేషన్‌కు అర్హులైన స్కూల్ బాలికలను 2018 ఏప్రిల్ నాటికి గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినా మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ పట్టించుకోలేదు. కాగా, 8 జిల్లాల పరిధిలోని 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడిట్ నిర్వహించగా కేవలం మూడు జిల్లాలోనే రేషన్ పొందుతున్న స్కూల్ బాలికల నమోదును గుర్తించారు. ఇలా వందకోట్ల విలువైన రేషన్ పక్కదారి పట్టినట్లు ఆడిట్‌లో తేలింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే. 10వేల మెట్రిక్ టన్నులకు పైగా రేషన్ సరుకులు అసలు రవాణే కాలేదు.
2020 ఉపఎన్నికల్లో ఓటమితో ఇమర్తి దేవి మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నాటి నుంచి మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉంది. దీంతో ఆయన కనుసన్నల్లోనే ఈ శాఖలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

