నేడు బిహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

నేడు బిహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకానుంది. ఈ మేరకు మధ్యాహ్నం పన్నెండున్నరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేయనుంది. కరోనా విజృంభణ తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్రస్థాయి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబర్ 29తో ముగియనుంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో సురక్షితంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సహా పలు వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. వీలైనంత తక్కువ దశల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక స్థానానికీ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కొవిడ్‌తో ముగ్గురు లోక్‌సభ సభ్యులు మృతిచెందగా వారి స్థానాల్లోనూ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com