Nitish Kumar: జనాభా నియంత్రణపై బీహార్ సీఎం స్పీచ్

Nitish Kumar: జనాభా నియంత్రణపై బీహార్ సీఎం స్పీచ్
మహిళలను అవమానించడమేనన్న బీజేపీ ఎమ్మెల్యే నివేదితా సింగ్

బీహార్ అసెంబ్లీలో దుమారం రేగింది. నిండు సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తప్పుగా , అసభ్యంగా మాట్లాడారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తుండగా.. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్థించారు. బీహార్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందీ అంశం..

అసెంబ్లీ సమావేశాలలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ జనాభా నియంత్రణ ఇష్యూను ప్రస్తావించారు. జనాభా నియంత్రణ విషయం విషయంలో మహిళలే చొరవ తీసుకోవాలని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నితీశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణలో ఉంటుందని చెబుతూ షాకింగ్‌ కామెంట్లు చేశారు. అంతే కాదు అనకూడాని మాటలు కూడా అన్నారు. నితీశ్‌ వ్యాఖ్యలకు పురుష ఎమ్మెల్యేలు ముసిముసిగా నవ్వుకుంటే.. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర ఇబ్బందిపడ్డారు. ముఖ్యమంత్రి ఇదంతా మాట్లాడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నవ్వుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నితీశ్‌ వాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు కాముకత, స్త్రీ ద్వేషంతో కూడినినవి అని.. మహిళలను తీవ్ర అవమానించేలా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్‌ వాడిన ‘పదజాలం’పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నితీశ్‌ ‘ఓ అసభ్యకరమైన నాయకుడు’ అని, ఇలాంటి వ్యక్తి భారత రాజకీయాల్లో మరొకరు కనిపించరని తూర్పారబట్టింది. మహిళలు విద్యావంతులైతే జనాభా అదుపులో ఉంటుందనే సందేశాన్ని నితీశ్‌ ‘అభ్యంతరకరమైన తీరు’లో కాకుండా చక్కని మాటలతో చెప్పాల్సిందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహించారు. నితీశ్ వ్యాఖ్యలపై డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ అసెంబ్లీ బయట మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అని, ప్రస్తుతం స్కూలు విద్యార్థులు కూడా దానిని చదువుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదని తేజస్వీ తెలిపారు.

నిండు సభలో బీహార్ ముఖ్యమంత్రి నోటివెంట అలాంటి ప్రసంగం వినలేక పోయానంటూ బీజేపీ ఎమ్మెల్యే నివేదితా సింగ్ చెప్పారు. తనతో పాటు మరో ఏడెనిమిది మంది మహిళా సభ్యులు అప్పుడు అసెంబ్లీలో ఉన్నారని వివరించారు. తమ లీడర్ ప్రసంగాన్ని వినాలని వారు అనుకోవచ్చు.. దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ మాటలు మాత్రం నేను వినలేక పోయా అంటూ నివేదిత కన్నీటిపర్యంతమయ్యారు. మహిళలందరినీ ముఖ్యమంత్రి బహిరంగంగా, అసెంబ్లీ వేదికగా అవమానించారని చెప్పారు. నితీశ్ ప్రసంగం సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సమర్థించడాన్ని నివేదిత తప్పుబట్టారు.


Tags

Read MoreRead Less
Next Story