Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు లోక్‌భవన్ చేరుకున్న ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. నితీశ్ కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటు చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్‌కు తెలియజేశారు.
నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా పలువురు బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో తొలిసారి ఆ పార్టీ ఈ పదవిని చేపట్టినట్లవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.
రాజీనామా గురించి నితీశ్ కుమార్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. సీఎం పదవిని వదిలేయాలని నిర్ణయించానని, ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత, గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఇక్కడి బాధ్యతలను చూసుకుంటుందన్నారు. కొత్త సర్కారుకు తన పూర్తి మద్దతు, మార్గదర్శకత ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు జరుగుతాయన్నారు. బీహార్ చాలా అడ్వాన్స్ అవుతుందన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
