Bihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు చేయిస్తా : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

Bihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు చేయిస్తా :   బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
Bihar Politics : జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు

Bihar Politics : జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు. మొత్తం ఏడు పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లు గవర్నర్ ఫాగు చౌహాన్‌కు ఇచ్చిన లేఖలో నితీశ్ తెలిపారు. జేడియా-ఆర్జేడీ-కాంగ్రెస్- సీపీఐ ఎంఎల్ ఇతర పార్టీల మద్దతుతో నితీశ్ ప్రభుత్వం ఈ నెల 10న కొలువు తీరింది. నితీశ్ ముఖ్యమంత్రిగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

మరోవైపు ... కేబినెట్ విస్తరణపై భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 35 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశమివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. జేడియూ నుంచి 13 మందికి, ఆర్జేడీ నుంచి 16 మందికి అవకాశమివ్వనున్నారు. కాంగ్రెస్‌కి 4, జితన్ రామ్ మాంజీకి చెందిన హెచ్ ఏ ఎం పార్టీకి ఒక మంత్రి పదవి దక్కనుంది. ఈ నెల 24, 25 తేదీల్లో బీహార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త స్పీకర్ ఎన్నిక కూడా అప్పుడే జరుగుతుంది. ప్రస్తుత స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు ససేమిరా అనడంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిపై తానేమీ వ్యాఖ్యానించబోనని సిన్హా చెప్పారు.

గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత బీజేపీ-జేడియూ మధ్య పొత్తు వికటించింది. ఈ నెల 9న ఈ పొత్తుకు గుడ్‌బై చెప్పి ఆర్జేడీ-కాంగ్రెస్- సీపీఐ ఎంఎల్‌తో నితీశ్ జత కట్టారు. తక్కువ సీట్లు వచ్చినా సీఎంని చేస్తే తమకు వెన్నుపోటు పొడిచి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, తన పార్టీని బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్రల నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చినట్లు నితీశ్ చెబుతున్నారు.

ఈడీ సీబీఐ వంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌. ఈ దాడులతో శాంతి వస్తుందంటే ఆ సంస్థలకు తన ఇంట్లోనే ఆఫీసులను ఏర్పాటు చేసేందుకైనా సిద్ధమేనన్నారాయన. బీజేపీ తన ప్రత్యర్థి నేతలపై దాడులు చేయిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ వస్తోన్న ఆరోపణలపై తేజస్వీ యాదవ్‌ స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story