చివరి స్టేజ్‌కు బీహార్ ఎన్నికల పోరు..

చివరి స్టేజ్‌కు బీహార్ ఎన్నికల పోరు..

నెల రోజులుగా హోరాహోరీగా సాగుతున్న బీహార్ దంగల్ చివరి స్టేజ్‌కు చేరుకుంది. చివరిదైన మూడో దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈ ఎన్నికలను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్డీయే తరఫున విస్తృతంగా పర్యటించారు. మారుమూల జిల్లాలైన అరారియా, సహస్రలో మొత్తం 12 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. నీతీశ్‌కు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. మహా కూటమి తరఫున రాహుల్‌ గాంధీ సైతం మాధేపుర, అరారియా జిల్లాల్లో ఎన్నికల సభల్లో పాల్గొని ఈవీఎంలను మోదీ ఓటింగ్‌ మెషిన్‌ లంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ బీహార్ ప్రజలకు నాలుగు పేజీల లేఖ రాశారు. బీహార్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని... ప్రగతి పథంలో నడిచే రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధారించడానికి అభివృద్ధి పథకాలు నిలిచిపోకూడదని అన్నారు. ఇందుకోసం బీహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం అవసరం అంటూ రాసిన లేఖను ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. బీహార్‌లో జేడీయూ- BJP ప్రభుత్వాలను రెండు ఇంజిన్ల శక్తిగా పేర్కొన్న మోదీ.. దీని వల్ల రానున్న దశాబ్దకాలంలో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త మైలురాళ్లను చేరుకుంటుందని వివరించారు. ప్రజలు కులం పేరుతో ఓట్లు వేయొద్దని.. అభివృద్ధిని చూసి వేయాలని కోరారు.

అటు ప్రచారం చివరి రోజు బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇవే తన చివరి ఎన్నికలని చెప్పారు. మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ సైతం విస్తృతంగా పర్యటించారు. మరోవైపు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ సభలకూ పెద్ద ఎత్తున జనం హాజరవ్వడం కనిపించింది. ముస్లిం ఓటర్లు ప్రధానంగా ఉండే సీమాంచల్‌ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆరు పార్టీల కూటమి తరఫున ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. కొవిడ్‌ వేళ జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో తెలియాలంటే ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందే..!

Tags

Read MoreRead Less
Next Story