Bihar: బిహార్‌లో హీటెక్కిన రాజకీయాలు..

బిహార్‌లో రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మరోసారి బిహార్‌లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాలని NDA వ్యూహాలు రచిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో భాజపా నేతృత్వంలోని అండ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో NDA 39 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. 2019లో భారతీయ జనతా పార్టీ 17 స్థానాలు JDU 17 స్థానాలు రామ్ విలాస్ పాశవాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేశాయి. భాజపా పోటీ చేసిన 17 స్థానాల్లోనూ విజయం సాధించగా... లోక్ జన్‌శక్తి పార్టీ కూడా ఆరు స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది.
జేడీయూ 17 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో గెలిచింది. కూటమిలోని పార్టీలన్నీ ఆదిపత్యం ప్రదర్శించడంతో 40 స్థానాల్లో 39 స్థానాలు NDA వశమయ్యాయి. ఈసారి కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలని NDA భావిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత విడిపోయిన JDU... మరోసారి NDAతో జట్టు కట్టింది. పాత కాపులంతా ఏకమై మరోసారి బిహార్‌లో సాధికార విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో 39 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నామని ఈసారి 40 స్థానాలను కైవసం చేసుకుంటామని బిహార్‌లో భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే ధీమా వ్యక్తం చేశారు.
అయితే భాజపా నేతృత్వంలోని కూటమిలో అసంతృప్త గళాలు వినిపిస్తుండడం NDAను ఆందోళనకు గురిచేస్తోంది. కూటమిలో సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పశుపతి కుమార్ పరాస్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి ఐదు సీట్లు కేటాయించడంపై అసంతృప్తికి గురైన చిరాగ్ బాబాయి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన లోక్‌జన్‌శక్తి పార్టీ.. ఆ తర్వాత విభేదాల కారణంగా రెండు ముక్కలైంది. రామ్ విలాస్ పాశవాన్ మరణానంతరం చిరాగ్ పాసవాన్‌తో వచ్చిన విభేదాల కారణంగా 2020 అక్టోబర్‌లో పశుపతి కుమార్ పరాస్ రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీని స్థాపించి ఎన్డీఏతో జట్టు కట్టారు. మిత్ర పక్షాలతో సీట్ల పంపకాల్లో భాజపా తమకు అన్యాయం చేసిందని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ RLJPకి సీట్లు కేటాయించకుండా అవమానించిందని పరాస్ ఆవేదన వ్యక్తం చేశారు.చిరాగ్ పాశవాన్ నేతృత్వంలోని లోక్‌జన్‌శక్తి పార్టీకి అయిదు సీట్లు ఇవ్వగా.. రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై... ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికలపై పరాస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. NDAకు తాను నిజాయతీ, విధేయతతో సేవ చేశానని.. కానీ తనకు అన్యాయం జరిగిందని పరాస్ వాపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com