Nitin Nabin: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్‌ను నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో పార్టీ ఈ మార్పు చేపట్టింది. కాగా, అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీనే కావడం విశేషం. ఆయన వయసు 45 సంవత్సరాలు.
ఈ సందర్భంగా నితిన్ నబిన్ మాట్లాడుతూ, తనకు ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ, ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. "దేశవ్యాప్తంగా పార్టీ విజయాల వెనుక కార్యకర్తల కఠోర శ్రమ ఉంది. నా లాంటి నాయకులతో పాటు ప్రధాని మోదీకి కూడా వారే అసలైన బలం" అని 45 ఏళ్ల నితిన్ వ్యాఖ్యానించారు.
అనంతరం ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. "గతంలో కూడా మనం చూశాం. ప్రధాని మోదీని ఎంతగా దూషిస్తే, ఆయన సునామీ అంతగా పెరుగుతారు. మరింత భారీ మెజారిటీతో ఆయన విజయం సాధిస్తారు" అని నితిన్ నబిన్ అన్నారు.
పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ నబిన్, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. విద్యార్థి రాజకీయాల నుంచి రాష్ట్ర మంత్రి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగిన నితిన్, క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

