Bihar Politics : బిహార్‌లో రాజకీయ సంక్షోభం.. జేడీయూ కీలక నిర్ణయం..

Bihar Politics : బిహార్‌లో రాజకీయ సంక్షోభం.. జేడీయూ కీలక నిర్ణయం..
Bihar Politics : బిహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమి మధ్య విభేదాలు పాకానపడుతున్నాయి.

Bihar Politics : బిహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమి మధ్య విభేదాలు పాకానపడుతున్నాయి. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జేడీయూ పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్‌ సమావేశం కాబోతున్నారు. అనంతరం చేసే ప్రకటనలు ఈ అంశంపై కొంత స్పష్టతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై జేడీయూ దృష్టి సారించింది.

గత బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 77 సీట్లు, జేడీయూకు 45 సీట్లు వచ్చాయి. అయినా బీజేపీ అధిష్టానం నితీశ్‌నే సీఎం చే‌సింది. అయితే జేడియూపై పూర్తిగా బీజేపీ పట్టు సాధించిందని నితీశ్ అనుమానిస్తున్నారు. తన పార్టీకే చెందిన కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్‌కు రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగియడంతో ఆయన్ను కొనసాగించడం నితీశ్‌కు ఇష్టం లేదు .కేంద్ర మంత్రివర్గంలో జేడియూ తరపున ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడం కూడా నితీశ్‌కు నచ్చలేదు. బీహార్‌లోనూ అమిత్‌ షా ప్రభావం పెరగడం... జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయన మాటే వినడం నితీశ్ కోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కొన్ని నెలలుగా బీజేపీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు. రాష్ట్రంలో పొసగని విధంగా ఉంటున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ మాత్రం నితీష్ కుమార్ పట్ల సాదరంగా వ్యవహరిస్తున్నది. కానీ, ఆయన కేంద్రం పిలిచిన సమావేశాలకు వెళ్లడం లేదు. తాజా నీతి ఆయోగ్ మీటింగ్ సహా రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రమాణం సహా ఇతర కార్యక్రమాలకు కేంద్రం పిలిచినప్పటికీ నితీష్ హాజరుకాలేదు.

బీజేపీతో తెగదెంపులకు సిద్ధపడుతున్న నితీశ్... ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫోన్‌ చేసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించారని సమాచారం. మరోవైపు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌తో కూడా నితీశ్ ఇప్పటికే రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్డీయేతో పొత్తు కొనసాగించాలా లేక తెంచుకోవాలా అనే అంశంపై తేల్చుకునేందుకు నితీశ్ కుమార్... జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కాబోతున్నారు.

అటు రాష్ట్రీయ జనతాదళ్ కూడా ఈ సాయంత్రం పాట్నాలో సమావేశం నిర్వహించనుంది. పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను పాట్నా చేరుకోవాలని తేజస్వీ యాదవ్ ఆదేశించారు. జేడియూ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆర్జేడీ తన పావులను కదపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను పాట్నాలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించింది. 243 మంది సభ్యులున్న బీహార్ శాసనసభలో ఆర్జేడీకి 80, బీజేపీకి 77, జేడియూకు 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 122. జేడియూ, కాంగ్రెస్‌, వామపక్షాలు కలిస్తే సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు.

ప్రస్తుతం బీజేపీకి టాటా చెప్పి ఆర్జేడీతో కొనసాగించాలని నితీస్‌ నిర్ణయించుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story