Bihar Thief : ఫోన్ కొట్టేసి.. కదులుతున్న రైలు నుండి దూకేశాడు

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా దొంగలు బుద్ధి మార్చుకోవడం లేదు. దొంగతనం కోసం ఎంత సాహసాలకైనా తెగిస్తున్నారు. తాజాగా ఒక దొంగ రైల్లో మొబైల్ దొంగతనం చేశాడు. అనంతరం వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బీహార్‌లోని భాగల్‌పుర్ నుంచి ముజఫర్‌పుర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. ఒక దొంగ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగిలించాడు. ప్రయాణికుడు గమనించి బెల్టుతో కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే దొంగ సినిమా స్టైల్‌లో ఫుట్‌బోర్డు దగ్గర రాడ్డును పట్టుకుని వేలాడుతూ కనిపించాడు. ఒంటి నిండా గాయాలు ఉన్నా.. ప్రమాదం అని తెలిసి కూడా అలానే వేలాడుతూ కనిపించాడు. చివరికి కొంత దూరం వెళ్లాక కిందకు దూకేశాడు. సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అతడు ఏమయ్యాడన్న విషయం తెలియదు. గాయాలయ్యాయా? లేదంటే చనిపోయాడా? అన్న విషయం తెలియదు. ఈ ఘటనపై జమల్‌పుర్ రైల్వే ఎస్పీ రామన్ చౌదరి స్పందిస్తూ.. వీడియో ఆధారగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. జూలై 22న బరియార్‌పూర్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com