Supreme Court: బిల్కిస్ బానో కేసులో దోషులకు షాక్

బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టేసింది. దోషులుగా ఉన్న 11 మందికి ఈ ఆదివారం లోగా అందరూ సరెండర్ కావాలని ఇవాళ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలని కోర్టును ఆ దోషులు అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేసిన ఆరోపణలపై ఆ నిందితులు జైలుశిక్ష అనుభవించారు. అయితే ఇటీవల క్షమాభిక్ష ఆధారంగా వాళ్లు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
ఆ రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థన విన్న సుప్రీం.. దోషులు మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకెళ్లిన దోషులకు చుక్కెదురైంది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ ఇవాళ తీర్పును ఇచ్చింది. పిటీషనర్ల వాదనలో పస లేదని, దోషులు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు పేర్కొంది.
ఈ కేసును పూర్తిగా పరిశీలించినట్లైతే.. 2002 లో జరిగిన గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణిగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు.. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని వారిని చిన్నా పెద్దా అని చూడకుండా ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 వ తేదీన జీవిత ఖైదు విధించింది. అయితే గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ 11 మంది దోషులకు రెమిషన్ పై విడుదల చేశారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ 11 మంది నిందితులు తిరిగి జైలుకు వెళ్లాల్సిదే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com