భయపెట్టనున్న బిపర్ జాయ్
అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తుఫాను బిపర్ జాయ్ రానున్న 12 గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతుందని తెలిపింది. దీన్ని బట్టి వచ్చే మూడు రోజుల్లో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయి. తుఫాను ప్రభావంతో గుజరాత్ లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ అలల కారణంగా గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తితాల్ బీచ్ ను ఈ నెల 14 వరకు మూసివేస్తున్నట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. పోరు బందర్, జాంనగర్, ద్వారకలో వర్షాలు కురుస్తున్నాయి.
కేరళలో కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు IMD అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్ళవద్దని ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే వారి కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి షెల్టర్లు ఏర్పాటు చేశారు.
మోచా తుఫాను తర్వాత ఈ తుఫాను మరో విధ్వంసం సృష్టించే పరిణామాలు కనిపిస్తూ ఉండటంతో మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బిపర్ జాయ్ జూన్ 15 నాటికి పాకిస్తాన్, ఉత్తర గుజరాత్ పై అత్యంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ తో పాటు పలు రాష్ట్రాలలో గాలుల వేగం గంటకు 135 కిలోమీటర్ల ఉండగా అది మరింతగా పెరిగి 160 కిలోమీటర్లకు చేరుతుందని అంచనా.
మరోవైపు వాయువ్య పాకిస్తాన్లో భారీ వర్షాలు కారణంగా చాలా ఇల్లు కూలిపోయాయి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 165 మంది గాయపడ్డారు. రంగం లోకి దిగిన ఆధికారులు అత్యవసర సహాయాన్ని కొనసాగిస్తున్నారు. గతేడాది రుతుపవనాలు మరియు వరదలు పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సుమారు రెండు వేల మంది మరణించగా సుమారు 8 మిలియన్ ల మంది నిరాశ్రయులయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com