ముంచుకొస్తోన్న బిపర్జాయ్
బిపర్జాయ్ తుపాను ముంచుకొస్తోంది. ఇవాళ తీరాన్ని దాటనుంది. దీంతో గుజరాత్‌లో భారీ వర్షాలతో పాటు అతి బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను గుజరాత్‌లోని కచ్, దక్షిణ పాకిస్థాన్ వైపు దిశను మార్చుకుంటోందని, జఖౌవద్ద తీరాన్ని దాటనుందని వెల్లడించింది. తీరాన్ని దాటే సమయంలో 145 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తాయని.... సౌరాష్ట్ర, కచ్‌లలో కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తువరకూ ఎగిసిపడతాయని తెలిపింది. ఇక... తుఫాన్ కారణంగా... రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోనూ వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రస్తుతం తుపాను కచ్‌కు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపాను స్వల్పంగా బలహీనపడినా గుజరాత్‌కు ముప్పు పొంచే ఉందని ఐఎండీ వెల్లడించింది. దేవభూమి ద్వారక, జాంనగర్, జునాగఢ్, పోర్‌బందర్, రాజ్‌కోట్ జిల్లాల్లోని తొమ్మిది తాలూకాల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తుపాను ముప్పుతో గుజరాత్ తీర ప్రాంతాల్లోని సుమారు 80వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సైన్యాన్ని సిద్దం చేసింది కేంద్రం. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు 18 ఎన్‌డీఆర్‌ఎఫ్, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్, 115 రోడ్లు, భవనాలు, 397 విద్యుత్తు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని 4వేల హోర్డింగ్‌లను అధికారులు తొలగించారు. మహారాష్ట్రలోనూ 14 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు మోహరించారు. ముంబయిలో 5 బృందా లను సిద్ధంగా ఉంచారు.
బిపోర్ జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు దమణ్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com