Sambhal Violence: సంభాల్ మసీదు సర్వేలో హింస.. బీజేపీ హస్తం ఉందన్న

బాబార్ సమయంలో ఆలయంపై మసీదు నిర్మించారని కోర్టులో కేసు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఆదివారం జరిగిన హింస వెనుక బీజేపీ ఉందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల రిగ్గింగ్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ హింసకు పాల్పడిందని విమర్శించారు. మొఘల్ కాలం నాటి జామా మసీదు సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణ నేపథ్యంలో హింస చెలరేగింది. ముగ్గురు వ్యక్తులు మరణించగా, పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.

కాగా, సంభాల్‌లో జరిగిన హింసపై అఖిలేష్‌ యాదవ్ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం హింసను ప్రేరేపించిందని ఆరోపించారు. ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని విమర్శించారు.

మరోవైపు మసీదును ఇప్పటికే సర్వే చేయగా మళ్లీ ఎందుకు సర్వే చేస్తున్నారని అఖిలేష్‌ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై చర్చలను అణచివేయడానికి ముందస్తు ప్లాన్‌లో భాగంగా ఈ హింస జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలనను నివారించడానికి ఇది ఒక పక్కా వ్యూహమని మండిపడ్డారు.

అసలేం జరిగింది అంటే..

మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వేకి ఆదేశించింది. సర్వే కోసం వచ్చిన అధికారులపై స్థానికులు రాళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసులకు, అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారి ముగ్గురి వ్యక్తుల మరణానికి దారి తీసింది. మసీదు హిందూ దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందనే వాదనలపై కోర్టు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే టీం తన పని ప్రారంభించే సమయంలో మసీదు సమీపంలోని జనం గమిగూడటంతో హింస మొదలైంది. మసీదులోకి అధికారులు ప్రవేశించకుండా పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాదాపుగా 1000 మంది, సంఘటన స్థలంలో పోలీసులు, ఇతర అధికారులపై రాళ్లు రువ్వారు. పదికి పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ‘‘బాబర్నామా’’,‘‘ఐన్-ఏ-అక్బరీ’’ వంటి చారిత్రక గ్రంథాలలో ఉన్నట్లు పిటిషనర్లు వాదించారు. సర్వేలో చారిత్రక నిజాలను వెలికితీసేందుకు సర్వేని కోర్టు ఆదేశించింది. అయితే, మరో వర్గం మాత్రం 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకరాం.. సర్వే మత పవిత్రతను ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తున్నారు.


Tags

Next Story