P Chidambaram: పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’ చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

P Chidambaram:  పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’ చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు
X
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లు ఆధారాలు లేవు..

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మనదేశానికి చెందిన వారేనని అన్నారు. వారు పాకిస్థాన్ నుంచి వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని చిదంబరం ప్రశ్నించారు. ఈమేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎన్ఐఏ) ఇప్పటి వరకూ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గుర్తుచేశారు. దర్యాప్తు వివరాలను ప్రభుత్వం కూడా బయటపెట్టడంలేదని, ఇన్ని రోజులు గడిచినా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదేమని నిలదీశారు.

పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను అసలు గుర్తించారా..? ఇన్ని రోజులుగా ఎన్ఐఏ అధికారులు ఏంచేస్తున్నారు? ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని ఎలా నిర్ధారించారు? దానికి ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలేంటి? దర్యాప్తు వివరాలను కేంద్రం ఎందుకు బయటపెట్టడంలేదు? అంటూ చిదంబరం పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో పలువురు స్థానికులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వారి పరిస్థితి ఏమైందని, విచారణలో వారు వెల్లడించిన వివరాలను కేంద్రం బయటకు వెల్లడించక పోవడానికి కారణమేంటని చిదంబరం ప్రశ్నించారు.

ఆపరేషన్ సిందూర్ పైనా చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడుల సందర్భంగా పొరపాట్లు దొర్లాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బహిరంగంగానే అంగీకరించారని చిదంబరం పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందని ఆరోపించారు. యుద్ధంలో రెండువైపులా నష్టం వాటిల్లుతుందనే విషయం అందరికీ తెలుసని చిదంబరం పేర్కొన్నారు.

Tags

Next Story