Navya Haridas: వయనాడ్‌లో ప్రియాంకగాంధీపై పోటీచేసే అభ్యర్థి నవ్య హరిదాస్
వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీపై పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. కేరళ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నవ్య హరిదాస్ పేరుని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నవ్య ప్రస్తుతం కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారని ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్‌ని బట్టి అర్థమవుతోంది. పార్టీ డైనమిక్ లీడర్‌లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. 2007లో బీటెక్ పూర్తి చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్‌తో పాటు అమేథీ నియోజకవర్గం నుంచి కూడా గెలుపొందారు. దీంతో వయనాడ్‌ను ఆయన వదులుకున్నారు. ఈ స్థానంలో పోటీకి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.
ఎవరీ నవ్య హరిదాస్?
ఇక ప్రియాంక గాంధీ మీదకు బీజేపీ బరిలోకి దింపుతున్న నవ్య హరిదాస్ ఎవరనే విషయాలను గమనిస్తే.. నవ్య హరిదాస్ ఓ మెకానికల్ ఇంజనీర్. 2007లో కాలికట్ యూనివర్సిటీ పరిధిలోని కేఎంసీటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ లెక్కల ప్రకారం నవ్య హరిదాస్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. అలాగే రూ.1,29,56,264 ఆస్తులు.. రూ.1,64,978 అప్పులు ఉన్నాయి. ఆమె ట్విటర్ ప్రొఫైల్ ప్రకారం నవ్య హరిదాస్.. కోజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే ఆమె ఫేస్‌బుక్ పేజీ పరిశీలిస్తే.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా. బీజేఎంఎం స్టేట్ జనరల్ సెక్రటరీగా పేర్కొన్నారు.
మరోవైపు వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎల్డీఎఫ్ ఇప్పటికే సీపీఐ లీడర్ సత్యన్ మోకేరీ పేరును ప్రకటించింది. కోజికోడ్ జిల్లా నడపురం నియోజకవర్గం నుంచి సత్యన్ గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే వయనాడ్ లోక్‌సభ స్థానానికి గతంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. 2014 ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసిన సత్యన్.. కాంగ్రెస్ అభ్యర్థి షాన్వాజ్ మెజారిటీని భారీగా తగ్గించగలిగారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు వయనాడ్ అభ్యర్థితో పాటుగా అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఉపఎన్నికలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com