Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి మెజారిటీ..

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్.. ఇప్పటికే బీజేపీ సగం మార్కును దాటింది. ఈ క్రమంలో.. బీజేపీ సీఎం అభ్యర్థి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. మిగతా 50 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. అరుణాచల్‌లో 60 స్థానాలు ఉండగా, సిక్కింలో 32 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. 24 జిల్లా కేంద్రాల్లో ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) పవన్ కుమార్ సైన్ తెలిపారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అరుణాచల్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే 31 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.
కౌంటింగ్ ప్రక్రియను 2,000 మందికి పైగా అధికారులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 82.71 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రెండు లోక్‌సభ స్థానాలకు 77.51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com