Rajasthan: ప్రియురాలి కోసం భార్యను చంపిన బీజేపీ నేత..

Rajasthan:  ప్రియురాలి కోసం భార్యను చంపిన బీజేపీ నేత..
X
దోపిడీ డ్రామాతో కవర్ చేసే యత్నం!

ప్రియురాలితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భార్యనే అత్యంత దారుణంగా హత్య చేశాడో భర్త. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు దోపిడీ నాటకం ఆడినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నేత అయిన భర్తే ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.

అజ్మీర్‌కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైనీకి సంజు అనే మహిళతో వివాహమైంది. అయితే, అదే ప్రాంతానికి చెందిన రీతూ సైనీ అనే మరో మహిళతో రోహిత్‌కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తమ బంధానికి భార్య సంజు అడ్డుగా ఉందని భావించారు. ఈ నెల 10న సంజు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మరణించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రోహిత్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇంట్లోకి చొరబడిన దొంగలు, తన భార్యను హత్య చేసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.

ఈ కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ (రూరల్) దీపక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. "ప్రియురాలు రీతూ ప్రోద్బలంతోనే రోహిత్ తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. తమ మధ్య నుంచి సంజును తొలగించుకోవాలని రీతూ ఒత్తిడి చేయడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించాం" అని ఆయన వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రోహిత్ సైనీతో పాటు, హత్యకు ప్రేరేపించిన అతని ప్రియురాలు రీతూ సైనీని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు.

Next Story