J&K Assembly Elections : జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు

J&K Assembly Elections :  జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు
X
60 నుంచి 70 స్థానాల్లో బీజేపీ, తొలి జాబితా విడుదల చేసిన ఆప్

సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారభించింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

317 అధికరణ రద్దుతో తమకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న బీజేపీ.. కేంద్రపాలిత ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా 60 నుంచి 70 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నది. అదీ ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తున్నది. తాము పోటీలో లేని చోట బలమైన స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలుగు వ్యక్తులైన రామ్‌ మాధవ్‌, కిషన్‌ రెడ్డిలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

కాగా, చివరిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25, పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. దీంతో పీడీపీ చీఫ్‌ మొహమ్మద్‌ ముఫ్తీ సయీద్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2016, జనవరిలో సయీద్‌ మరణంతో ఆయన కుమార్తే మెహబూబా ముఫ్తీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. 2018 జూన్‌లో ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 317 ఆర్టికల్‌ను రద్దు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.

Tags

Next Story