Nishikant Dubey: దేశంలో అంతర్యుద్ధాలకు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాదే బాధ్యత

Nishikant Dubey: దేశంలో అంతర్యుద్ధాలకు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాదే బాధ్యత
X
సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ ఫైర్

దేశ సర్వోన్నత న్యాయస్థానంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మత యుద్ధాలను ప్రేరేపిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారిస్తూ.. తదుపరి విచారణ వరకు చట్టాన్ని నిలిపివేసింది. అలాగే బిల్లుల ఆమోదంపై 3 నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ విధమైన తీర్పులను ఉద్దేశించి దూబే మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టుపై మండిపడ్డారు.

సుప్రీంకోర్టు తన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే పార్లముంట్, అసెంబ్లీలు ఎందుకు? మూసేయాలన్నారు. మత యుద్ధాలను ప్రేరేపించడానికి ధర్మాసనం ఇలా వ్యవహారిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలని న్యాయస్థానం కోరుకుంటోందని ఆరోపించారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. దేశ చట్టాన్ని పార్లమెంట్ రూపొందిస్తుంది. అలాంటప్పుడు పార్లమెంట్‌ను సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది?. మూడు నెలల్లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఏ చట్టంలో ఉంది అని నిలదీశారు. దీని బట్టి చూస్తే.. దేశాన్ని సుప్రీంకోర్టు అరాచకం వైపు తీసుకెళ్లాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తన పరిమితులను మంచిపోతోందని.. అందుకు కోర్టే బాధ్యత వహించాల్సి ఉంటుందని దూబే హెచ్చరించారు.

వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక.. మళ్లీ ప్రభుత్వం నుంచి వివరణ కోరడమేంటి? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం చట్టాలను రూపొందించడం పార్లమెంటు పని అని, ఆ చట్టాలను నిర్వర్తించే బాధ్యత సుప్రీంకోర్టు పని అన్నారు. కోర్టులు.. ప్రభుత్వాలను ఆదేశించగలవు గానీ.. పార్లమెంట్‌ను కాదని సూచించారు. ఇక స్వలింగ సంపర్కంపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా దూబే తీవ్రంగా తప్పుపట్టారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదన్న ధర్మాసనం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

ఇటీవల సుప్రీంకోర్టు తీరును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కూడా తప్పుపట్టారు. తాజాగా అదే వరుసలో దూబే చేరారు. ఇలా పలువురు బీజేపీ ఎంపీలు.. సుప్రీం ధర్మాసనం తీరును తప్పుపడుతున్నారు. అయితే బీజేపీ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. సుప్రీంకోర్టును బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.

Tags

Next Story