Varun Gandhi: ఫిలిబిత్‌ బీజేపీ టిక్కెట్‌పై సన్నగిల్లుతున్న ఆశలు..

Varun Gandhi: ఫిలిబిత్‌ బీజేపీ టిక్కెట్‌పై సన్నగిల్లుతున్న ఆశలు..
బీజేపీ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?

భాజపా ఎంపీ వరుణ్‌గాంధీకి ఆ పార్టీ ఈసారి టికెట్‌ నిరాకరిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే స్వతంత్ర అభ్యర్థిగా పీలీభీత్‌ స్థానం నుంచి పోటీ చేయాలని వరుణ్‌ గాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా యోగి సర్కార్‌ తీరుపై వరుణ్‌ విమర్శలు చేయడమే ఆయనకు టికెట్‌ నిరాకరణకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుణ్‌ను తమవైపు తిప్పుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వరుణ్‌ ఇటీవల సోదరుడైన రాహుల్‌ గాంధీని కలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

భాజపా MP వరుణ్‌గాంధీ కొంతకాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న క్రమంలో కమలం పార్టీ టికెట్టు నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. 2019లో UPలోని పీలీభీత్‌ స్థానం నుంచి బరిలో దిగిన ఆయన.. మూడోసారి ఎంపీ అయ్యారు. యూపీలో 51 స్థానాలకు భాజపా తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ఖరారు చేయని 24 స్థానాల్లో వరుణ్‌ గాంధీతో పాటు ఆయన తల్లి మేనకాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న పీలిభీత్‌, సుల్తాన్‌పుర్‌లు ఉన్నాయి. ఈసారి మేనకాగాంధీకి సుల్తాన్‌పుర్‌ ఖరారు చేసే అవకాశం ఉన్నా వరుణ్‌కు మాత్రం మొండిచేయి చూపొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

భాజపా కేంద్ర నాయకత్వంతో పాటు ముఖ్యంగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కొంత కాలంగా వరుణ్‌ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర భాజపా నాయకత్వం ఆయనకు టికెట్‌ నిరాకరించాలని కోర్‌కమిటీ మీటింగ్‌లో కోరినట్లు సమాచారం. వరుణ్‌ గాంధీకి భాజపా టికెట్‌ ఇవ్వదన్న వార్తలు వినిపిస్తున్న వేళ.. ఆయనను తమ వైపు తిప్పుకోవాలని సమాజ్‌వాదీపార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక వేళ వరుణ్‌ తమను సంప్రదిస్తే టికెట్‌ ఇవ్వాలా వద్దా అని ఇతర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటివరకు సమాజ్‌వాదీ పార్టీ కూడా పీలీభీత్‌ స్థానం కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలైన మేనకాగాంధీ.. ఆమెతో విబేధించి వేరుపడిన సంగతి తెలిసిందే. తర్వాత మేనకాగాంధీతో పాటు ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ భాజపాలో కొనసాగుతున్నారు. అటు.. కొన్ని రోజుల క్రితం వరుణ్‌గాంధీ.. వరుసకు సోదరుడు అయిన రాహుల్‌గాంధీని కేదార్‌నాథ్‌లో కలవడం చర్చనీయాంశం అయింది. వరుణ్‌ తమ కుటుంబీకులు కొనసాగుతున్న కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story