BJP: బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు ప్రకటన.. 11 మంది సభ్యులతో..

BJP: బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు ప్రకటన.. 11 మంది సభ్యులతో..
BJP: బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు.

BJP: బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ బోర్డులో 11 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యడ్యూరప్ప, శర్బానంద్‌ సోనోవాల్‌, కె. లక్ష్మణ్‌, ఇక్బాల్‌ సింగ్‌, సుధాయాదవ్‌, సత్యనారాయణ జటియా, బిఎల్‌ సంతోష్‌ను నియమించింది. దక్షిణాది నుంచి లక్ష్మణ్‌, యడ్యూరప్ప, సంతోష్‌కు స్థానం కల్పించారు.

పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌కు చోటు కల్పించడంతో.. బీజేపీ దక్షిణాదిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడైన లక్ష్మణ్‌ను బోర్డులోకి తీసుకోవడం వల్ల ఆ వర్గానికి పార్టీ కల్పిస్తున్న ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలోనూ ఈ చర్య వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. ఈ సారి పార్లమెంటరీ బోర్డు నుంచి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గడ్కరీను తొలగించింది. అలాగే 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఏర్పాటయ్యింది.

ఇందులోనూ లక్ష్మణ్‌కు స్థానం కల్పించారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా జేపీ నడ్డా వ్యవహరించనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌కు చోటు కల్పించడం హర్షనీయమన్నారు బండి సంజయ్‌. ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల తరఫున లక్ష్మణ్‌కు ఈ అకాశం కల్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం దక్కిందని కొనియాడారు.

Tags

Read MoreRead Less
Next Story