BJP National Council meetings : రెండు రోజులపాటు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు..

BJP National Council meetings : రెండు రోజులపాటు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు..
భారత మండపం వేదికగా..

నేటి ప్రారంభం కానున్న భాజపా జాతీయ మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న లోక్‌ సభ ఎన్నికలకు భాజపా అజెండాను నాయకులకు నిర్దేశించనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి 11 వేల 500 మంది పార్టీ కార్యకర్తలు, జిల్లా,రాష్ట్ర స్థాయి నేతలు , సీనియర్‌ భాజపా నేతలు, మంత్రులు హాజరవనున్నారు. ఈ సమావేశాలను భాజపా అధ్యక్షుడు JP నడ్డా ప్రారంభిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో 370కిపైగా స్థానాల్లో భాజపా విజయం సాధించడంపై పార్టీ శ్రేణులకు ఆదివారం ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీలోని భారత్‌ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమం ఇటీవల కాలంలో భాజపా నిర్వహించిన అతిపెద్ద సమావేశంగా నిలవనుంది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం, అయోధ్య రామమందిర నిర్మాణం, 2023లో విజయవంతంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సు, మోదీ సంక్షేమ పథకాల ఫలితాలపై జాతీయ మండలి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని సమావేశంలో చర్చిస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1995లో ముంబయిలో 10 వేల మంది కార్యకర్తలతో ప్లీనరీ సమావేశాన్ని భాజపా నిర్వహించింది. తద్వారా 1996లో భాజపా అధికారాన్ని సాధించిందని భాజపా నేతలు గుర్తు చేసుకున్నారు. 2014, 2019 లో కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఇప్పుడు నిర్వహించే సమావేశాలతో భాజపా రానున్న ఎన్నికల్లో 370కిపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొంది నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా ప్రధాని నరేంద్రమోదీ చరిత్ర కెక్కుతారని భాజపా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story