Bengaluru Blast: బెంగళూరు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక పరిణామం

బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫెలో జరిగిన ప్రమాదాన్నిmబాంబు పేలుడుగా తేల్చారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ప్రకటించారు. బాంబు పేలుడు వెనుక ఉన్న బాధ్యులను తేల్చనున్నట్లు తెలిపారు. ఈ పేలుడు గురించి NIA, IBలకు సమాచారం ఇచ్చినట్లు కర్ణాటక DGP వెల్లడించారు. బాంబు ఉన్న బ్యాగ్‌ను నిందితుడు కేఫ్‌లో వదిలివెళ్లినట్టు చెప్పారు.
కాగా, సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించినట్టు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతడి వయసు 28- 30 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్‌లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్‌ను అక్కడ వదిలేసి వెల్లిపోయాడని చెప్పారు. ఇక ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్యేనా? కాదా? అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు.
బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫెలో జరిగిన ఘటన బాంబు పేలుడు అని తేల్చారు. అయితే తక్కువ తీవ్రత కలిగిన బాంబుగా గుర్తించారు. పేలుడు జరిగిన సమయంలో కేఫెలో దాదాపు 40మంది వరకు ఉన్నారని, ఈ ప్రమాదంలో 9మంది గాయపడినట్లు...పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా...ఏడుగురు కస్టమర్లని చెప్పారు. అయితే ఎవరు కూడా తీవ్రంగా గాయపడలేదన్నారు. కేఫెలో ఆరుగురు కస్టమర్లతో కలిసి కూర్చున్న మహిళ వెనకాల...పేలిపోయిన హ్యాండ్‌బ్యాగ్ పడి ఉందని...అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలిపారు. బ్యాగ్‌లోని అనుమానిత పదార్థం వల్లనే...పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ వల్ల పేలుడు జరగలేదన్నది స్పష్టమని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ చెప్పారు. ఎక్కడా కూడా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఆనవాళ్లు లేవన్నారు. టీ, కాఫీ తయారీకోసం వాడే మరో గ్యాస్ సిలిండర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. దానినుంచి కూడా గ్యాస్ లీక్ కాలేదని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.
మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పేలుడు జరిగినట్లు రామేశ్వరం కేఫె నుంచి పోలీసులకు సమాచారం అందినట్లు...కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నట్లుచెప్పారు. బెంగళూరు పోలీసు కమిషనర్, ఇతర అధికారులు ప్రమాదస్థలంలోనే ఉండి... దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో త్వరలోనే తేలుస్తామన్నారు.
ప్రమాద ఘటన గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వరకు సమాచారం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు పూర్తి గా నిర్ధారణకు వచ్చాక అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని...ఘటనాస్థలంలో బ్యాటరీ లభించాయన్న మీడియా ప్రశ్నకు డీజీపీ సమాధానం ఇచ్చారు. ఈ ప్రమాదం గురించి...జాతీయ దర్యాప్తు సంస్థ-NIA, ఇంటెలిజెన్స్ బ్యూరో-IBకి కూడా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com