Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసులో అనుమానితుల గుర్తింపు

Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసులో అనుమానితుల గుర్తింపు
భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. మరోవైపు తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్‌లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటన అనంతరం ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారతదేశంలోని తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది.

న్యూఢిల్లీలోని చాణక్యపురి దౌత్యవేత్త ఎన్‌క్లేవ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడులో ఎవరూ గాయపడలేదు. మంగళవారం సాయంత్రం 5:48 గంటలకు తమ దేశ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ చెప్పారు. ఇజ్రాయెల్ పౌరులు బహిరంగ ప్రదేశాలైన రెస్టారెంట్‌లు, హోటళ్లు, పబ్‌లలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ దేశం కోరింది. ఇజ్రాయెల్ చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించ రాదని, భారీ-స్థాయి ఈవెంట్‌లకు హాజరుకావద్దని ఇజ్రాయెల్ సూచించింది. రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న సెంట్రల్ హిందీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వెలుపల గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో పేలుడు సంభవించిన వెంటనే ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం సంభవించిన ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు లేదు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ ఎంబసీ రాయబారిని ఉద్దేశించి టైప్ చేసిన లేఖ ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తూ ఆ లేఖ ఉంది. ఆంగ్లంలో రాసిన ఆ లేఖలో ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. కాగా ‘‘సర్ అల్లా రెసిస్టెన్స్’’ అనే సమూహం ఈ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story