Engineering Students: అమ్మాయిలకు రక్షణగా జుంకాలు

మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సరికొత్తగా ఆలోచించారు. సాంకేతికతను వినియోగించి 'బ్లూటూత్ జుంకాలు' తయారు చేశారు. ఆకతాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంగా ఉపయోగపడేలా వీటిని రూపొందించారు.
గోరఖ్‌పూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐటీఎం) ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థినులు కలిసి ఈ బ్లూటూత్ జుంకాలను తయారు చేయడం జరిగింది. కళాశాలలోని ఆవిష్కరణ విభాగం సమన్వయకర్త వినీత్రాయ్ ఆధ్వర్వంలో అఫ్రీన్ ఖాతూన్, హబీబా, రియాసింగ్, ఫాయా నూరీ ఈ జుంకాలను తయారు చేశారు. ఈ బృందానికి వీటిని రూపొందించడానికి రెండు వారాల సమయం పట్టింది.
సాధారణ జుంకాల మాదిరిగా కనిపించే వీటిలో బ్లూటూత్ ఇయర్‌బడ్‌ను అమర్చారు. అలానే ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఇవి ఓ ఆయుధంలా ఉపయోగడపతాయని విద్యార్థులు వివరించారు. వీటిలో బ్యాటరీతో కూడిన బ్లూటూత్ మాడ్యూల్, రెండు స్విచ్లు, చిన్న స్టీల్ పైపును అనుసంధానం చేశారు. 35 గ్రాముల బరువు ఉన్న వీటిలో రెండు అలారం స్విచ్లు, మూడు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఫీడ్ చేశారు. మహిళలను ఆకతాయి ఇబ్బంది పెడితే వెంటనే స్విచ్ నొక్కితే ఈ జుంకాల నుంచి ఎమర్జెన్సీ కాల్స్ వెళ్లడంతో పాటు మహిళలు ఉన్న లొకేషన్ కూడా పోలీసులకు చేరిపోతుంది.
కాగా, తమ విద్యార్థుల ఈ సరికొత్త ఆవిష్కరణ పట్ల ఐటీఎం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్‌కే సింగ్, సెక్రటరీ అనుజ్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల ఎల్లప్పుడూ ఒక ప్రయోగంలో అవసరమైన పరికరాలను అందిస్తుందనీ, విద్యార్థులు పరిశోధనా కార్యకలాపాలను కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా కళాశాల అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com