Kangana Ranaut : దేశానికి జాతిపితలు లేరు..గాంధీ జయంతి వేళ కంగనా పోస్ట్

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తరుచూ ఏదో ఒక విషయంలో నోరుజారి వివాదాల్లో నిలవడం పరిపాటిగా మారిపోయింది. రాజకీయ నాయకురాలుగా మారిన తర్వాత కూడా ఆమె తీరు మార్చుకోలేదు. తాజాగా, గాంధీ జయంతి వేళ మహాత్ముడ్ని కించపరిచేలా ఆమె చేసిన పోస్ట్‌పై దుమారం రేగుతోంది. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రైతుల ఉద్యమం, కేంద్ర వెనక్కి తీసుకున్న సాగు చట్టాలపై చేసిన వ్యాఖ్యలకు ఆమె విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా ‘దేశానికి జాతిపితలు ఎవరూ లేరు... కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు.. భారతమాతకు ఇలాంటి బిడ్డలు (లాల్ బహదూర్ శాస్త్రి) ఉండటం అదృష్టం’ అని కంగనా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. మహాత్మా గాంధీని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేశారని ఆరోపించింది. కాగా, మరో పోస్ట్‌లో మాత్రం దేశంలో పరిశుభ్రతపై గాంధీజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె ప్రశంసలు కురిపించారు.
లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మాగాంధీలపై కంగనా చేసిన పోస్టులు మరో వివాదానికి దారితీశాయి. మహాత్మాగాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే మండిపడ్డారు. గాడ్సే ఆరాధకులు బాపు, శాస్త్రిల మధ్య తేడా చూపుతారని, నరేంద్ర మోదీ తన పార్టీ కొత్త గాడ్సే భక్తుడిని హృదయం నుండి క్షమిస్తారా? అంటూ ప్రశ్నించారు.
పంజాబ్ బీజేపీ సీనియర్ నేత మనోరంజన్ కాలియా కూడా కంగనా రనౌత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'గాంధీ 155వ జయంతి సందర్భంగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఆమె రాజకీయ జీవితంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటైంది. రాజకీయం తన రంగం కాదు. రాజకీయాలు చాలా సీరియస్ విషయం. మాట్లాడే ముందు ఆలోచించండి.' అని కాలియా అన్నారు. ఇలా కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com