Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బెదిరింపులు

Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బెదిరింపులు
X
వారంలో రెండో సారి..

దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మరోసారి ఈ-మెయిల్‌ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని తెలిపారు. సూళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడంతో ఈ వారంలో ఇది రెండోసారి.

ఈస్ట్‌ ఆఫ్‌ కైలాష్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, సల్వాన్‌ స్కూల్‌, మోడరన్‌ స్కూల్‌, కేంబ్రిడ్జి స్కూల్స్‌తోపాటు మొత్తం 16 పాఠశాలలకు శుక్రవారం ఉదయం 4.30 గంటలకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రత్తమైన ఆయా యాజమాన్యాలు పిల్లలను స్కూళ్లను పంపించవద్దని, ఒక వేళ పంపితే వెనక్కి తీసుకెళ్లిపోవాలని సమాచారం అందించారు. ఇక ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ సహా పోలీసులు, బాంబు డిటెక్షన్‌ టీమ్‌లు, డాగ్‌ స్క్వాడ్‌లు స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అయితే బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ను డార్క్‌ వెబ్‌ నుంచి పంపినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ‘మీ విద్యార్థులు స్కూల్‌లోపలికి వచ్చే సమయంలో మీరు తనిఖీలు చేయరని నమ్ముతున్నాను. మేం అమర్చిన బాంబులు భవనాలను ధ్వంసం చేయడంతోపాటు ప్రజలకు ప్రాణనష్టం జరుగుతుంది. డిసెంబర్‌ 13, 14 తేదీల్లో మీ స్కూళ్లలో ఈ తరహా విధ్వంసం జరగొచ్చు. ఈ నెల 14న పలు పాళశాలల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ జరగడం బాంబులు పేల్చేందుకు మాకు మంచి అవకాశం. మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిని మీరే నెరవేర్చాలి. అందుకు అంగీకరిస్తే వెంటనే మే పంపిన మెయిల్స్‌కు సమాధానం ఇవ్వండి’ అని వాటిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెయిల్స్‌ పంపిన ఐపీ అడ్రస్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.

సోమవారం (ఈ నెల 9న) ఢిల్లీలోని 40కిపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, జీడీ గోయెంక పబ్లిక్‌ స్కూల్‌ వంటివి ఉన్నాయి. పేలుళ్లు ఆపాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని ఆగంతకులు మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే పోలీసుల తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇదంతా నఖిలీ మెయిల్స్‌ అని నిర్ధారించారు.

Tags

Next Story