Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. మాల్వియా నగర్‌లోని ఎస్‌కేవీ హౌజ్ రాణి, కరోల్ బాగ్‌లోని ఆంధ్రా స్కూల్‌కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.
సోమవారం కూడా ఇదే తరహాలో రాజధాని అంతటా 32 పాఠశాలలకు మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు రంగంలోకి దిగి విద్యార్థులను ఇంటికి పంపేసి తనిఖీలు చేపట్టగా నకిలీ బాంబ్ బెదిరింపుగా గుర్తించారు. తిరిగి 48 గంటలలోపు ఇదే తరహాలో తాజాగా ఈ బెదిరింపులు వచ్చాయి.
జనవరి నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కనీసం 74 విద్యా సంస్థలు, 70 పాఠశాలలు, నాలుగు కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. జూలై నెలలోనే రోహిణి, పితంపుర, పశ్చిమ విహార్, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీలో దాదాపు 50 పాఠశాలలను లక్ష్యంగా ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఖాళీ చేయించారు. హిందూ కళాశాల, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఐపీ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి కళాశాలలు ఇబ్బందిపడ్డాయి. గత నెలలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, సెయింట్ థామస్ పాఠశాలకు బెదిరింపులు పంపినందుకు 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ తర్వాత పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు నకిలీవేనని తేలిందని, అయితే ప్రతి ఒక్కటి పూర్తి తీవ్రతతో దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ బాంబ్ బెదిరింపులు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చిలిపి పనులే అయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనల సృష్టిస్తున్నాయి. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com