Pragya Thakur : మీ కూతురు వేరే మతస్తుడితో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి.. లవ్ జిహాద్‌పై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు

: బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్‌లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా తమ కుమార్తెలు ప్రవర్తిస్తే వారిని శారీరకంగా శిక్షించాలని సూచించారు. అలాగే, మీ కుమార్తె మాట వినకుండా హిందూయేతరుల ఇంటికి వెళితే, ఆమె కాళ్లు విరగ్గొట్టడానికి ఏ మాత్రం వెనుకాడకండి అని పేర్కొనింది. విలువలను పాటించనివారు, తల్లిదండ్రుల మాట విననివారు శిక్షార్హులు అని చెప్పుకొచ్చింది. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారిని కొట్టాల్సి వస్తే వెనకడుగు వేయకండి అని తెలిపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంట్లో కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు లక్ష్మీ, సరస్వతి రూపంగా భావించి, సంబరపడతామని ప్రజ్ఞా సింగ్ తెలిపారు. కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్తుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ప్రశ్నించారు. అలా ఇతర మతస్తుడిని కావాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఆపడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతర మతాల యువకులను తమ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలను నియంత్రించాలని తల్లిదండ్రులను ప్రజ్ఞా సింగ్ కోరారు. పిల్లలకు మొదటి నుంచి విలువలను నేర్పించాలని సూచించారు. అయినప్పటికీ వారు మాట వినకపోతే, దారిలో పెట్టేందుకు కొట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గవద్దని అన్నారు. అలాంటి అమ్మాయిలకు గుణపాఠం చెప్పడం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.
అయితే, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కేవలం ఏడు మత మార్పిడుల కేసుల్లోనే శిక్ష పడితే, ఇంత గోల, విద్వేషం ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రజలను మత ప్రాతిపాదికన బీజేపీ విభజిస్తుంది అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com