ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

పెళ్లి చేయాలంటే దానికి చాలా ప్రయత్నం. అదే పెళ్లి క్యాన్సిల్ చేయాలంటే సింపుల్. దానికి పెద్ద రీజన్ కూడా ఉండాల్సిన పని లేదు. ఒకప్పుడు మగవాళ్ళే ఇలాంటివి చేసేవారు. ఇప్పుడు ఒక అమ్మాయి జరిగిన పెళ్లినే క్యాన్సిల్ చేసేసింది. దానికి కారణమేమనుకున్నారు కట్టుకున్న వాడికి జనరల్ నాలెడ్జ్ లేదని. అంతటితో ఆగిందా, పెళ్లి కొడుకు తమ్ముడితో మరోసారి తాళి కట్టించుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 11వ తేదీన శివశంకర్ రంజనులకు వివాహమైంది. వీరిద్దరికీ ఆరు నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా 12 వ తేదీన వధువు ఇంటికి వచ్చాడు వరుడు. సరదాగా ఇంట్లో ఉన్న బావమరిది, మరదలు తో మాటలు కలిపాడు. బావగారిని ఆటపట్టించాలంటూ అల్లరి ప్రశ్నలు వేస్తున్న మరదలు సడన్గా దేశ ప్రధాని ఎవరో చెప్పాలని కోరింది. నిజంగానే తెలియదో లేకుంటే తడబడ్డాడో తెలియదు కానీ శివశంకర్ ఆ ప్రశ్నకు బిక్క మొహం వేశాడు. అది చూసిన వధువు బంధువులు అతన్ని హేళన చేశారు. దాంతో వధువు రంజని ఆవేశపడిపోయింది.ఇది తనకు జరిగిన తీవ్రమైన అవమానంగా ఫీల్ అయిపోయింది. అక్కడికక్కడే శివశంకర్ తో పెళ్లిని రద్దు చేసేసుకున్నట్టు ప్రకటించింది. తన కంటే వయసులో చిన్నవాడైన పెళ్లి కొడుకు తమ్ముడ్ని బలవంతంగా పెళ్లాడింది. అయితే తన కుమారుడికి గన్ గురిపెట్టి, అందరినీ భయపెట్టి తన చిన్నకొడుకు అనంత్‌తో బలవంతంగా వివాహం జరిపించారని, శివ శంకర్ తండ్రి ఆరోపిస్తున్నాడు. జూన్ 13న వధువు తరపు వారు అకస్మాత్తుగా తన ఇంటికి వచ్చి గొడవపెట్టుకున్నారని ఆయన వెల్లడించాడు. జూన్ 17న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com