Heavy Rain: హిమాచల్‌లో వర్ష బీభత్సం... రెడ్ అలర్ట్ జారీ

రెండు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కొండ ప్రాంతం కావడంతో వర్షాలకు వరదలు పోటెత్తాయి. గత 36 గంటల్లో హిమాచల్ వ్యాప్తంగా 14 చోట్ల భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 చోట్ల అకస్మిక వరదలు పోటెత్తినట్లు ఎమర్జీన్సీ ఆపరేషన్స్ సెంటర్ ప్రకటించింది. 700 రహదారులను మూసివేసినట్లు వివరించింది.
హిమాచల్‌లో అన్ని నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నట్లు వెల్లడించింది. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మండిలో బియాస్ నది ఉద్ధృతికి పండో బజార్ ప్రాంతం నీట మునిగింది. ఔట్-బంజార్ ప్రాంతాలను అనుసంధానించే పాతవంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. మొత్తం 12కు పది జిల్లాలకు వాతావరణ విభాగం తాజాగా రెడ్ అలర్ట్ జారీచేసింది. సిమ్లాలో కుంభవృష్టి కురవడంతో చాబా పవర్ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది. బియాస్ నది ఉధృత ప్రవాహానికి మండి జిల్లాలోని పంచవక్త్ర ఆలయం కూడా నీట మునిగింది. లాహౌల్ స్పితిలోని చంద్రతాల్‌లో 200 మంది చిక్కుకుపోగా వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
అటల్ టన్నెల్‌కు కిలోమీటరు దూరంలో టైలింగ్ నాలా వరద కారణంగా మనాలీ-లేహ్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కుల్లులో కొండచరియలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సిమ్లా, సిర్మౌర్, లాహౌల్ స్పితి, చంబా, సొలన్ జిల్లాల అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. సిమ్లా జిల్లాలోని కోట్ గడ్ లో ఇంటిపై కొండచరియలు పడి దంపతులు, వారి కుమారుడు సహా ముగ్గురు చనిపోయారు. కుల్లు పట్టణంలోని ఒక నివాసంపై కొండచరియలు పడగా మహిళ మృతిచెందింది. చాంబా జిల్లాలోని కతియాన్ తెహశీల్ వద్ద కొండచరియలు విరిగిపడి ఒకరు సజీవసమాధి అయ్యారు. కుల్లు జిల్లాలోని కసోల్ ప్రాంతంలో పలు వాహనాలు బియాస్ నది కొట్టుకుపోయాయి.
ఉదయ్‌పూర్‌లోని మద్రంగ్ నాలా, కాలా నాలా వరదలతో పలు రోడ్లను మూసివేశారు. సొలన్ జిల్లా కసౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.జిల్లా యంత్రాంగం నిర్మాణరంగ కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
మనాలీ వద్ద తారామిల్ ప్రాంతంలో జాతీయ రహదారి 3లో కొంతభాగం కోతకు గురైంది.
భారీ వర్షాల కారణంగా సిమ్లా నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. కసౌలి, కల్కా, సిమ్లాలో జాతీయ రహదారి 5పై కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 5పై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని... సోలన్ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాల సీజన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో... ఇప్పటివరకూ 362 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com