Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు నమోదు

మహిళా రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మంగళవారం ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల్ని కించపర్చడం తదితర అభియోగాలను నమోదుచేసింది. అయితే ఈ అభియోగాలను ఆయన తిరస్కరించారు. విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. ‘నాపై వచ్చిన ఆరోపణల కారణంగా మా పార్టీకి మరిన్ని ఓట్లు పడతాయి’ అంటూ వ్యాఖ్యానించారు.
బ్రిజ్ భూషణ్ నేరాన్ని ఏమైనా అంగీకరించారా? అని కోర్టు అడగ్గా.. ‘‘తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు నేరాన్ని ఎందుకు అంగీకరించాలి’’ అని అతడి తరఫు న్యాయవాది వెల్లడించారు. అలాగే తనపై వచ్చిన అభియోగాలన్నింటినీ భాజపా ఎంపీ తోసిపుచ్చారు. తాను విదేశాల్లో క్రీడాకారిణులతో ఒకే హోటల్‌లో బస చేయలేదని చెప్పారు. అతడి మాజీ కార్యదర్శి వినోద్ తోమర్‌పైనా అభియోగాలు నమోదయ్యాయి. ‘‘అవన్నీ తప్పుడు ఆరోపణలు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేనెవరినీ ఇంటికి పిలవలేదు. ఎవరినీ తిట్టలేదు, బెదిరించలేదు’’ అని తోమర్ వెల్లడించారు. కోర్టులో వాదనల అనంతరం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ‘‘ప్రస్తుతానికి నాపై అభియోగాలు నమోదయ్యాయి. వారు వాటిని నిరూపించాల్సి ఉంది’’ అని అన్నారు.
రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు నిరుడు ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతణ్ని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో దిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో నేరపూరిత బెదిరింపు కింద అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసులో సహ-నిందితుడు, మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా క్రిమినల్ అభియోగాన్ని కోర్టు నమోదుచేసింది. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలతో బ్రిజ్ భూషణ్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్‌కు ఈసారి టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. ఆయన కుమారుడు కరణ్‌భూషణ్ సింగ్‌ను ఎన్నికల బరిలో నిలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com