Wrestlers : బ్రిజ్‌భూషణ్‌ శిక్షార్హుడే అన్న పోలీసులు... హాజరుకావాలన్న కోర్టు

Wrestlers : బ్రిజ్‌భూషణ్‌ శిక్షార్హుడే అన్న పోలీసులు... హాజరుకావాలన్న కోర్టు
బ్రిజ్‌ భూషణ్‌పై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు... లైంగిక వేధింపులు నిజమేనని వెల్లడి.. నేరం రుజువైతే బ్రిజ్‌భూషణ్‌కు ఐదేళ్ల జైలు...

భాజపా ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు బలం చేకూరుతోంది. బ్రిజ్‌భూషణ్‌ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో తెలిపారు. బాధితులను లైంగికంగా వెంటబడి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నమోదైన ఆరు కేసుల్లో ఆయన వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్‌ తయారు చేశామని పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.


బాధితులను నేరపూరితంగా బెదిరించడం, మహిళల గౌరవ, మర్యాదలను భంగపరచడం, లైంగిక వేధింపులు, వెంటాడటం వంటి నేరాలకు బ్రిజ్‌భూషణ్‌ పాల్పడినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ కేసులను నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఓ బాధితురాలిపై సింగ్ వేధింపులు పదే పదే కొనసాగినట్లు ఆరోపించారు. రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 108 మంది సాక్షులను ప్రశ్నించినట్లు, వీరిలో 15 మంది ఈ ఆరోపణలను సమర్థించినట్లు ఢిల్లీ పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు. ఈ 15 మందిలో రెజ్లర్లు, కోచ్‌లు, రిఫరీలు ఉన్నారని తెలిపారు.


ఛార్జిషీట్‌ దాఖలుతో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు జారీ చేసింది. కేసును విచారించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జూలై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.


ఒక మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లు తమను బ్రిజ్‌ భూషణ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23వ తేదీన నిరసన ప్రారంభించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా లాంటి ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం రోజున ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌ షా, అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన తర్వాత వారు తమ నిరసనను విరమించారు. జూన్ 15లోగా ఈ కేసులో బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జిషీటు దాఖలు చేస్తామని అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లకు హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story