Captain Brijesh Thapa: ఆర్మీ డే నాడు జన్మించాడు..దేశం కోసం మరణించాడు.

Captain Brijesh Thapa: ఆర్మీ డే నాడు జన్మించాడు..దేశం కోసం మరణించాడు.
X
హృదయాన్ని మెలిపెడుతున్న కెప్టెన్‌ బ్రిజేశ్‌ తల్లి ఆవేదన

జమ్మూకశ్మీర్‌లోని డోడా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన కెప్టెన్‌ బ్రిజేశ్‌ తల్లి ఆవేదన చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. తన బిడ్డ ఇక ఇంటికి రాడంటూ బరువెక్కిన హృదయంతో ఆమె కన్నీరుమున్నీరు అవుతోంది. మరోవైపు.. బ్రిజేశ్‌ మాతృదేశం కోసం ప్రాణత్యాగం చేశాడన్న ఆత్మసంతృప్తితో గుండె లోతుల్లో కాస్త గర్వం. డోడా వద్ద సోమవారం జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన కెప్టెన్‌ బ్రిజేశ్‌ థాపా మాతృమూర్తి నీలిమా థాపా ఆవేదన ఇది. ముష్కరుల దాడిలో 27 ఏళ్ల బ్రిజేశ్‌ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన స్వస్థలమైన పశ్చిమబెంగాల్‌లోని సిలీగుడీలో విషాదఛాయలు అలముకున్నాయి. బ్రిజేశ్‌ తండ్రి భువనేశ్‌ కూడా ఆర్మీ అధికారే. కర్నల్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. చిన్నప్పటి నుంచీ తండ్రిని చూస్తూ పెరిగిన బ్రిజేశ్‌ ఆర్మీపై ఇష్టం పెంచుకున్నాడు. ఇంజినీరింగ్‌ చదివినా.. అయిదేళ్ల క్రితం ఆర్మీలో చేరి కల నెరవేర్చు కున్నాడు.

తండ్రి భువనేశ్ థాపా మాట్లాడుతూ.. తన కుమారుడిని చూసి గర్వపడుతున్నాని అన్నాడు. ఇది మిలటరీ ఆపరేషన్ అని, ఇలాంటి ఆపరేషన్లలో ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని భువనేష్ థాపా అన్నారు. ఇంకా ఎలాంటి ముప్పు వచ్చినా సైనిక సిబ్బంది సీరియస్‌గా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ‘నా కొడుకు తన కర్తవ్యాన్ని పూర్తి భక్తితో, గంభీరంగా నిర్వర్తించాడు’ అని చెప్పాడు. వీరమరణం పొందిన కెప్టెన్ కుటుంబ సభ్యులు డార్జిలింగ్‌లోని లెబాంగ్‌లో నివసిస్తున్నారు. కల్నల్ థాపా ప్రకారం.. కెప్టెన్ బ్రిజేష్ చివరిసారిగా జూలై 14న తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. సోమవారం రాత్రి బ్రిజేష్ బలిదానం కుటుంబ సభ్యులకు తెలిసింది. బ్రిజేష్ ఆర్మీలోని 145 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందినవాడని, 10వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై ఉన్నాడని అమరవీరుడు ఆర్మీ అధికారి తల్లి తెలిపారు. మార్చి నెలలో బ్రిజేష్ సెలవుపై ఇంటికి వచ్చాడని నీలిమా థాపా తెలిపింది. బ్రిజేష్ పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించాడు.. ముంబైలోని సైనిక్ స్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించాడు.

Tags

Next Story