BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన నిర్ణయం..

BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ దిగ్గజం యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ప్రస్తుతం తానూ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖారిపురా అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేయనున్నట్లు ప్రకటించారు. శిఖారిపురా నుంచి వచ్చే ఎన్నికల్లో తన కొడుకు, ప్రస్తుతం కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న బీ.వై. విజయేంద్ర పోటీ చేస్తారని చెప్పారు.
ఇకపై నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తానని.. తన కుమారుడు విజయేంద్ర సైతం వారానికి ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తారని యడియూరప్ప తెలిపారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదన్న ప్రచారం జరిగిన మరుసటి రోజే ఈ కామెంట్స్ చేశారు యడియూరప్ప. కాంగ్రెస్‌ను కర్ణాటకలో అధికారంలోకి రానివ్వనంటూ శపథం చేశారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని.. సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
కానీ అది జరగని పని అన్నారు యడియూరప్ప. ఐతే యడియూరప్ప రిటైర్‌మెంట్ వ్యాఖ్యలపై స్పందించారు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. యడియూరప్ప ఎప్పటికీ రిటైర్ కారని.. ఆయన సారథ్యంలోనే 2023 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. యడియూరప్ప తమకు తండ్రి లాంటి వారని.. ఈ విషయం అధిష్ఠానానికి తెలుసన్నారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని యడియూరప్ప కోరారు. కానీ ఆయన విజ్ఞప్తిని అధిష్ఠానం పక్కన పెట్టింది.
2018లో వరుణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. 2020 జులైలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు విజయేంద్ర. ఆయన నాయకత్వంలో పార్టీ అనేక బై ఎలక్షన్స్‌లో విజయం సాధించింది. యడియూరప్పకు గత ఫిబ్రవరితో 79 సంవత్సరాలు నిండాయి. ఐతే బీజేపీలో 75 సంవత్సరాలు పైబడిన వారు అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో ఉండ రాదన్న నిబంధన ఉంది. ఐనప్పటికీ 2017 ఎన్నికల్లో యడియూరప్పను కర్ణాటక సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. జులై 26 2021న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు యడియూరప్ప.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com