Union Budget 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్

Union Budget 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్
బడ్జెట్​లో కొత్త సోలార్ పథకం

పేద, మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణానికి ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ద్వారా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణానికి త్వరలో కొత్త పథకం తెస్తామన్నారు. 300 యూనిట్ల వరకూ విద్యుత్‌ ఉపయోగించే కుటుంబాలు ఉచితంగా పొందే మార్గాన్ని వివరించారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేర్చారు.

మోదీ సర్కారు పదేళ్ల పాలనలో ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కృషిచేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.ఈ పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50 శాతానికి పైగా పెరిగిందన్న ఆమె తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తికావస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు.గ్రామీణప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని గుర్తుచేశారు.


పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు త్వరలో కొత్త పథకం ప్రకటిస్తామని తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఇంటిపై సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగానే విద్యుత్‌ పొందే విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. నెలకు 300 యూనిట్ల వరకూ వినియోగించే..కోటి కుటుంబాలకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 15వేల నుంచి 18వేల రూపాయల వరకూ ఆదా అవుతుందని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమంతోపాటు ఆరోగ్యానికి కూడా అధిక ప్రధాన్యం ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.దేశంలో మరిన్ని మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేస్తామన్నారు.ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆశా వర్కర్లు , అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏటా 5లక్షల రూపాయల వరకూ వైద్య సాయం పొందవద్దని గుర్తుచేశారు. పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్రధనస్సు కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story