Budget 2024 Analysis: అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌

Budget 2024 Analysis: అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌
ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి అర్హత

ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్‌ భారత్‌ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్‌ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని..గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ‘పోషణ్‌ 2.0’ కార్యక్రమాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తామని పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడకుండా 9-14 ఏండ్ల బాలికలకు క్యాన్సర్‌ నిరోధక టీకాపై దృష్టి సారిస్తామన్నారు. మరోవైపు పిల్లల్లో రోగ నిరోధకత పెంచటానికి ‘మిషన్‌ ఇంద్రధనస్సు’ను నిర్వహించేందుకు ‘యు-విన్‌’ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

‘ప్రజలకు సేవ చేయాలని ఎంతో మంది యువత వైద్య వృత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మరిన్ని మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తాం’ అని నిర్మల తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఆరోగ్య రంగానికి ఈ సారి బడ్జెట్‌లో రూ.90,658.63 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇవి 12.59 శాతం ఎక్కువ. ఇందులో రూ.87,656.90 కోట్లు ఆరోగ్యం-కుటుంబ సంక్షేమానికి కేటాయించారు.


ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అర్హులైన వారందరికీ.. 5 లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా అందిస్తారు. ఇందుకోసం ఓ కార్డు ఇస్తారు. దీని ద్వారా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇది క్యాష్‌లెస్‌ సర్వీస్‌. ప్రస్తుతం ఈ పథకం కింద.. దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6.2 కోట్ల ఆస్పత్రుల్లో అడ్మిషన్స్‌ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో యువతకు శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్‌. వారికి నామమాత్ర వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story