Budget Session : నేడు అఖిల పక్ష భేటి

Budget Session : నేడు అఖిల పక్ష భేటి
X
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.

భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడో సారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి.

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం నేడు (జనవరి 30) ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, లోక్‌సభ డిప్యూటీ లీడర్, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, రాజ్యసభ లీడర్, ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురుగన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు, చర్చించాల్సిన అంశాలు పై తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

కేంద్ర బడ్జెట్ ప్రణాళిక, పార్లమెంటులో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు సమయం కేటాయింపు, రైతు సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక విధానాలపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే రంగాలు, ముఖ్య ప్రణాళికలు, ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు, ప్రతిపక్షాలు ఆర్థిక వ్యూహాలు, నిరుద్యోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరమని ప్రభుత్వం కోరనుంది. ఉభయసభల్లోని పలు పక్షాల నేతలు అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాలపై ప్రభుత్వం తరఫున మంత్రులు రాజనాధ్ సింగ్, జెపి నడ్డా సమాధానం ఇవ్వనున్నారు.

Tags

Next Story