Bulldozer Action : నాగ్ పూర్ అల్లర్ల కేసు.. నిందితుడి ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్..

నాగ్ పూర్ లో ఇటీవల చెలరేగిన హింసకు కారణమైన కీలక నిందితుడు ఫహీమ్ ఖాన్ కు చెందిన అక్రమ నిర్మాణాలపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతడి నివాసం, ఇతర నిర్మాణాలను నాగ్ పూర్ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున వీటిని కూల్చివేశామన్నారు.
మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడిగా పని చేస్తున్న ఫహీమ్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఘర్షణలకు కారణమయ్యారన్న ఆరోపణలతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 17న నాగ్ పూర్ లో కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
మతపరమైన వస్తువులు కాల్చి వేసినట్లు కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి కారణమైన ఫహీమ్ తో సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. 50 మంది నిందితులపై సైబర్ విభాగం నమోదు చేసిన నాలుగు ఎఫ్ఐఆర్ లలో వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 200 మంది నిందితులను గుర్తించామని, మరో వెయ్యి మందిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com