Omar Abdullah: మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో లేను

బ్లడీ షిట్ షో అంటూ ఢిల్లీ విమానాశ్రయ సేవలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు. పరుష పదజాలం ఉపయోగించినందుకు ఎక్స్‌క్యూజ్ చేయాలని, ప్రస్తుతం మర్యాదగా మాట్లాడే మూడ్‌లో లేనంటూ తనకు కలిగిన అసౌకర్యంపై ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. శనివారం రాత్రి సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండిగో విమానంలో జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడం, విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ విమానాన్ని దారిమళ్లించారు. మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. రాత్రి ఒంటి గంట సమయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో దిగింది. మరో రెండు గంటల తర్వాత అంటే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. అయితే విమానం ఆలస్యం కావడంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ అంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.
జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం.. జైపూర్‌లో ల్యాండ్ అయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను విమానం మెట్లపై నిలుచుని మాట్లాడుతున్నా. స్వచ్ఛమైన గాలిని పొందుతున్నా. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. Delhi airport is a bloody shit show (excuse my French, but I’m in no mood to be polite) అంటూ ట్వీట్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నట్లు మరోసారి ఎక్స్‌లో పోస్టుచేశారు.
కాగా, గత వారం రోజులుగా ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమాన సర్వీసులను దారిమళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ఢిల్లీ విమానాశ్రయం ఆదివారం ఉదయం ప్రయాణికులకు ఓ సలహా జారీ చేసింది. సర్వీసుల షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com