CAA: ప్రజలను రెచ్చగొట్టడానికే ఎన్నికల ముందు సీఏఏ

సీఏఏ అమలు నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి.భాజపా.. విభజన ఎజెండాతో సమాజంలో చీలిక తెచ్చేందుకు, ఓట్లను గుప్పిట పట్టేందుకు వివక్షాపూరిత చట్టాన్ని తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల బాండ్ల వివరాల బహిర్గతంపై సుప్రీం తీర్పు రోజే,. సీఏఏ అమలు చేయడం ద్వారా, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని తెలిపింది. మతకోణంలో పౌరసత్వ జారీ రాజ్యాంగ విరుద్ధమని, సీఏఏను అమలు చేయబోమని కేరళ CM విజయన్ స్పష్టంచేశారు.
జాతీయ పౌర పట్టికను దొంగచాటున అమలు చేయడానికి సీఏఏను కేంద్రం ఉపయోగిస్తుందేమో అని బెంగాల్ CM మమతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల పేదల ఓట్ల కోసం భాజపా చేస్తున్న నీచ రాజకీయమని దిల్లీ CM కేజ్రివాల్ అన్నారు. ముస్లింలు, శ్రీలంక తమిళులను భాజపా మోసం చేస్తోందని తమిళనాడు CM స్టాలిన్ చెప్పారు. పౌరసత్వం అనేది మతం, జాతీయతపై ఆధారపడి ఉండద్దని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ పాలనలో లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ ఇదని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. సమానత్వ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు CAA వ్యతిరేకమని ఆమ్నెస్టీ ఇండియా పేర్కొంది. ప్రధాని మోదీ CAA అమలు ద్వారా రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. 2019 మానిఫెస్టోలోని వాగ్దానాన్ని నెరవేర్చినట్లు చెప్పారు. పాక్, అఫ్ఘన్, బంగ్లాదేశ్‌లలో వేధింపులు ఎదుర్కొన్న మైనారిటీలకు గౌరవప్రదమైన జీవితం దక్కుతుందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ హర్శం వ్యక్తం చేశారు.
ఏమిటీ సీఏఏ?
మతపరమైన హింస కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏను తీసుకొచ్చారు. శరణార్థుల దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనప్పటికీ పౌరసత్వాన్ని ఇస్తారు. 2014, డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.
అభ్యంతరాలు ఏమిటి?
1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ముస్లిం ఆధిపత్య దేశాల్లో మత హింస కారణంగా దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నదని, రాజ్యాంగ లౌకిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

