CAA: 7రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు- కేంద్ర మంత్రి శంతన్ థాకూర్

కేంద్ర మంత్రి శంతను థాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లోగా దేశమంతా సీఏఏను అమలు చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పర్‌గనాస్ జిల్లాలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించామని, మరో ఏడు రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేస్తామని ఆయన అన్నారు. ఇది తన గ్యారెంటీ అని, కేవలం పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సీఏఏను అమలు చేస్తామని ఆయన అన్నారు.
వివాదాస్పద పౌరసత్వం సవరణ చట్టం(సీఏఏ)ని అమలు చేయడాన్ని ఎవరూ ఆపలేరని గతేడాది కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీఏఏను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ.. చొరబాటు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు రాజకీయాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఆమె ప్రభుత్వాన్ని గద్దె దించి 2026లో బీజేపీని గెలిపించుకోవాలని ఆయన కోరారు.
2019లో పార్లమెంట్ రెండు సభల్లో సీఏఏ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత భారత్ అంతటా దీనిపై వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సీఏఏ కోసం కేంద్రం ఇంకా నిబంధనలు రూపొందించకపోవడంతో చట్టం అమలు ఆలస్యమవుతోంది.
సీఏఏ చట్టం ఏం చెబుతోంది?
సీఏఏ చట్టం కింద 2014 డిసెంబర్ 31 వరకూ బంగ్లాదేశ్, పాకిస్థా్న్, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీలు, క్రిస్టియన్లకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. 2019 డిసెంబర్‌లో సీసీఏను పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు. పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తోందనే కారణంగా హోం శాఖ ఎప్పటికప్పుడు నిబంధనల నోటిఫై చేయడాన్ని పొడిగిస్తూ వస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com