Chandrayaan-4 : చంద్రయాన్-4కు గ్రీన్‌సిగ్నల్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చేసిన కీలక ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం కల్పించింది. 2028 నాటికి భారతదేశానికి సంబంధించి తొలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ భారత అంతరిక్ష స్టేషన్‌కు సంబంధించి ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చేసిన ప్రకటనకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష స్టేషన్‌తోపాటు చంద్రయాన్-4, వీనస్ మిషన్, గగన్‌యాన్, అత్యాధునిక ప్రయోగ లాంచింగ్ వెహికల్స్ అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేబినెట్ ఆమోదం పొందడంతో త్వరలోనే ఇస్రో వీటికి సంబంధించిన పనులను ప్రారంభించనుంది.
ఈ క్రమంలోనే చంద్రుడిపై పరిశోధనలకు గానూ త్వరలోనే ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్-4 ప్రయోగానికి నరేంద్ర మోదీ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ఈ చంద్రయాన్ 4 మిషన్ కోసం రూ.2,104 కోట్లతో ఆమోదం తెలిపింది. ఇందులో చంద్రుడిపైకి చేరుకొని.. అక్కడి నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకోనుంది. చంద్రయాన్-4 ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని, శిలలను భూమి పైకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో 30 టన్నుల పేలోడ్‌లను ఉంచేందుకు నెక్ట్స్ జనరేషన్ లాంఛ్ వెహికల్‌ను ప్రయోగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
భూమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన శుక్రుడిపై అన్వేషణ కోసం ఇస్రో శుక్రయాన్-1(వీనస్ ఆర్బిటర్ మిషన్) చేపట్టనుంది. శుక్రగ్రహం సైతం భూమి లాగానే ఏర్పడిందని భావిస్తున్న శాస్త్రవేత్తలకు, ఈ గ్రహంపై భూమికి భిన్నంగా 450 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో వ్యోమనౌకను శుక్రగ్రహ కక్ష్యలోకి పంపించి, ఈ గ్రహం ఉపరితలం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయడమే శుక్రయాన్-1 లక్ష్యం. 2028 మార్చిలో ఈ ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తున్నది.
ఇటీవల భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొని ప్రసంగించిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. 2028 కల్లా అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనికోసం ప్రస్తుతం ఉన్న లాంఛర్ సామర్థ్యాలతోనే భారతదేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మన దేశం మాత్రమే కాకుండా.. ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా భారత అంతరిక్ష కేంద్రాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లు వివరించారు. ఆర్థిక కార్యకలాపాలకు అంతరిక్ష కేంద్రం ఉపయోగపడేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com